Sunday, January 1, 2012

లుంగీ

'కేరళ ఆర్థికంగా వెనకబడటానికి కారణం లింగభేదం లేకుండా చీటికి మాటికి ఒక కాలితో లుంగీని పైకి లేపి మడిచి కట్టి కాసేపాగి మళ్లీ కిందికి వదిలేస్తూ ... ఇలా ప్రతి పౌరుడూ రోజుకు 3 గంటల ఉత్పాదక సమయాన్ని వృథా చేసుకుంటున్నాడ'ని కనిపెట్టిన 'లుంగీ' http://data.whicdn.com/images/17693290/tie-a-lungi_large.jpg

  ఊహ తెలిశాక నేను రాత్రిళ్ళు లుంగీ కట్టకపోవడం చాలా అరుదు. ఆ లుంగీ నిద్రలో నా ఒంటిమీద నిలవడం అంతకంటే అరుదు. మొలతాడు, పురికొసలు పనిచేయడం లేదని తోలుబెల్టు కూడా ట్రై చేశా, లాభం లేకపోయింది. ఓసారి డాబా మీద పడుకుని పొద్దున్నే లేచి చూసుకుంటే... ఒంటిమీద కేవలం తోలుబెల్టు ఉంది. లుంగీ పక్కనే ఉన్న కరెంటు తీగల మీద రెపరెపలాడుతూ ఉంది. అప్పటి నుండి సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని లుంగీ వాడకాన్ని చాలా మట్టుకు ఇండోర్స్‌కే పరిమితం చేశా. ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో లుంగీ కట్టుకుని బయటికి వెళ్ళాల్సి వస్తే లోపల ప్యాంట్ వేసుకోవడం మరిచిపోను. ఇంత కష్టపడి వాడే బదులు షార్ట్స్, ట్రాక్స్ వాడి చావొచ్చుగా అని సకిలించే నోళ్ళు మూయించడానికి నా దగ్గర మూడు బలమైన కారణాలున్నాయి.

1. నేను పుట్టి పెరిగినదంతా 'అగ్నిగుండం'గా పేరొందిన 'రామగుండం'లో. టౌన్‌లో '50 శాతం డిస్కౌంట్ సేల్' ఆఖరి రోజని తెలిసినా సరే ఆడాళ్ళని గడప దాటనీయకుండా భయపెట్టే ఎండ ఈ ప్రాంతం సొంతం. ఎండ దెబ్బకి తాళలేక, వస్త్ర సన్యాసం చేయలేక, అవస్థలు పడే మగాళ్ళకి ఊరటనిచ్చేది ఈ తేలికపాటి లుంగీయే.
2. ఓసారి షార్ట్స్ వేసుకుని కిరాణా షాపుకెళ్లిన నన్ను షాప్ యజమాని బియ్యం బస్తాలు మోసే కూలి అనుకుని పొరబడడం (అవును మా వైపు, రైస్ మిల్లులో బియ్యం బస్తాలు మోసే కూలీలు మాత్రమే షార్ట్స్ వాడతారు.) జరిగింది.
3. బెట్టుకుపోయి ఒక వారం రోజుల పాటు రాత్రిళ్ళు జీన్స్ వేసుకు పడుకున్న మా రాజేశ్ గాడికి ఇంట్లో వాళ్ళకి చూపించుకోలేని చర్మ సమస్యలు తలెత్తుతాయి.
ఇలా నాలా, మనలో చాలామందికి లుంగీ వాడడానికి ప్రత్యేక కారణాలు ఉండకపోవచ్చు. కారణాలు ఉన్నా లేకున్నా ఈనాడు కుల మత ప్రాంతాలకతీతంగా మగాళ్ళ దైనందిన జీవితంలో ఒక భాగమై కూర్చుంది లుంగీ. ఇంటికొచ్చిన అతిథికి కట్టుకోవడానికి లుంగీ ఇవ్వకపోవడం నేరంగా పరిగణిస్తారు కొన్ని ప్రాంతాల్లో. అఫ్‌కోర్స్, ఈ లుంగీ ఆఫర్ వెనుక గుప్త లాభాలు ఉన్నాయనుకోండి. ఇంటికొచ్చినోడి మొహాన ఒక లుంగీ పడేస్తే, భోజనం అయ్యాక మూతి తుడుచుకోడానికి, స్నానమయ్యాక ఒళ్ళు తుడుచుకోడానికి సెపరేట్‌గా టవల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పెళ్ళిలో ఆడాళ్ళకైతే జాకెట్ గుడ్డ, మగాళ్ళకైతే లుంగీ గుడ్డ పెట్టేంత లోతుగా మన ఆచార వ్యవహారాలతో చుట్టుకుపోయింది లుంగీ.

ఆధునిక యాంత్రిక జీవితపు ఒత్తిడితో సతమతమయ్యే నేటి మగాడికి ఆధ్యాత్మిక ప్రశాంతతని చేకూర్చడంలో ఈ లుంగీ ఒక కీలక పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం. నా మట్టుకు నేను బాగా అలిసిపోయి ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక లుంగీ కట్టుకుని బాల్కనీలో కాళ్ళు జాపుకుని కూర్చొని, ఆకాశంలోకి అలా చూస్తూ సాంత్వన పొందుతూ ఉంటాను. నాలా మా ఫ్రెండ్స్‌లో చాలామందున్నారు లుంగీ ప్రియులు. ఆన్‌సైట్ ఆఫర్ల మీద తరచుగా దేశాలు తిరిగే మా వటపత్రసాయిగాడు లగేజ్‌లో లుంగీ లేనిదే కదలడు. ఏ దేశంలో ఉన్నా లుంగీ లేనిదే నిద్రపట్టదు వాడికి. ఎంత షార్ట్ ట్రిప్ అయినా సరే వాడి లగేజ్‌లో కనీసం రెండు బ్యాగులు ఉంటాయి. ఒక దాంట్లో ఆఫీస్ ల్యాప్‌టాప్ మరో బ్యాగ్ నిండా లుంగీలుంటాయి. మా రాజేశ్ గాడికి గళ్ళ లుంగీలంటే ప్రాణం. తీరిక సమయాల్లో లుంగీ పరుచుకుని దాని మీద అష్టాచెమ్మా ఆడుకోవడం వాడికి ఇష్టమైన హాబీ. ఇహ నా చిన్ననాటి మిత్రుడు నాగరాజుగాడైతే టైముకి ఇంట్లో లుంగీ కనబడకపోతే అలిగి వాళ్ళావిడ లంగా, జాకెట్టు కట్టుకుని తిరిగి నిరసన తెలిపే ఉన్మాది.



ఇదిలా ఉండగా, ఒకరోజు ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన కొలీగ్ రితీష్ కె. రఘుతో పిచ్చాపాటి మాట్లాడుతూ తనది ఏ ఊరని అడిగా 'come from the land of lungis...kerala' అని సకిలించాడు. నాకు వాడి సమాధానం రుచించలేదు. పైపెచ్చు నాకిష్టమైన లుంగీని వాడి రాష్ట్రీయ సొత్తు అన్నాడని ఒళ్ళు మండింది. నేను వెంటనే 'మా రాష్ట్రంలో లుంగీని విరివిగా వాడతాం... జనాభా రీత్యా విస్తీర్ణం రీత్యా చూసినా మాదే మీకన్నా పెద్ద రాష్ట్రం కనుక అయితే గియితే మాదే 'లుంగీ ల్యాండ్' కావాలి... అంటూ ఓంకార్ షోలో కంటెస్టెంట్‌లా రొప్పాను. దానికి వాడో వెటకారపు నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాడు... నేను నా విజయాన్ని నలుగురు ఆంధ్రా కొలీగ్స్‌తో క్యాంటీన్‌లో సెలబ్రేట్ చేసుకుని అరగంట తరువాత నా సీట్ దగ్గరికెళ్ళి ఆఫీస్ మెయిల్ బాక్స్ ఓపెన్ చేశా... రితీష్‌గాడి ఐడి నుండి ఏదో ఒక అటాచ్‌మెంట్ మెయిల్ ఉంది... తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెబుతూ గ్రీటింగ్ కార్డ్ పంపి ఉంటాడు. కుంక అనుకుంటూ ఓపెన్ చేశా. ఆ ఫోటో చూసి నా కళ్ళు, నోరు తెరుచుకోవడం కేటగిరీలో పోటీపడ్డాయి. సబ్జెక్ట్ లైన్‌లో 'Now tell me whose land does lungi belong to... hahahaha...' అని ఉంది.
http://s3.hubimg.com/u/478054_f496.jpg
వాడీఫోటోని ఫోటోషాప్ చేశాడేమో అని అనుమానంతో గూగుల్‌లో గాలించా... కుప్పలు తెప్పలుగా ఉన్నాయి లుంగీల్లో ఉన్న మలయాళీ స్త్రీమూర్తుల ఫోటోలు... ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో అయితే చిన్నా చితక, ముసలీ ముతక తేడా లేకుండా అందరూ లుంగీలో ఉన్నారు... పండగకి తానుల్లో కొన్నట్టున్నారు లుంగీ గుడ్డ... గాలింపులో భాగంగా నా అభిమాన నటి షకీలా లుంగీలో ఉన్న ఫోటో కూడా ఒకటి కనబడింది... ఉండబట్టలేక డౌన్‌లోడ్ పెడుతూ కింద ఏదో రాసి ఉంటే చదివా. "సినిమా షూటింగ్ అయిపోయాక షకీలా వాడిన ఆ లుంగీని స్థానిక టెంట్ హౌస్ ఓనర్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నాడు'' అని ఉంది. ఇంకేదో సైట్‌లో చదివా, అసలు కేరళ ఆర్థికంగా వెనకబడడానికి కారణం లింగ భేదం లేకుండా జనాలు చీటికి మాటికి ఒక కాలితో లుంగీని పైకి లేపి మడిచి కట్టి, కాసేపాగి మళ్ళీ క్రిందికి వదిలేస్తూ, ఇలా ఈ స్టంటుని లెక్కలేనన్ని సార్లు రిపీట్ చేస్తూ, సగటున ప్రతి పౌరుడు రోజుకి మూడు గంటల ఉత్పాదక సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు... అని. ఓటమి కుంగుబాటులో ఉన్న నాకు ఈ వార్త కాస్త ఓదార్పునిచ్చింది.
http://golisoda.in/wp-content/uploads/2011/12/Snehadaram-Photos-_27_.jpg
గూగుల్ గాలింపులో భాగంగా 'లుంగీ మాన్యువల్' నుండి దొరికిన ఒక చక్కటి ఫోటోని లుంగీ రంగు, రుచి, వాసన తెలియని నార్తిండియన్ కొలీగ్‌లని చైతన్యపరిచే ఉద్దేశ్యంతో ఫార్వర్డ్ చేశా... అదే ఫోటోని ఇక్కడ పెడుతున్నాను... మీలో ఎవరికన్నా లుంగీ కట్టు విషయంలో అనుమానాలున్నా, లుంగీ కట్టాలనే ఆసక్తి ఉండి ఎలా కట్టాలో తెలియకపోయినా క్రింది ఫోటో చూసి ప్రాక్టీస్ చేయొచ్చు.
గమనిక : పై ఫోటోలో ఒకటవ పాయింట్‌లో ఉన్న 'wear something underneath' అనే పాయింట్‌తో విభేదించే పిడివాదులు చాలా ప్రాంతాల్లో ఉన్నారు. మరి మీరేమంటారు?

- వీజె 2, డిసెంబర్ 2011
golisoda.in

No comments:

Post a Comment