Tuesday, May 31, 2011

అమృతమూర్తి

అమృతమూర్తి

16 ఏళ్ల ప్రాయంలో గాంధీ స్ఫూర్తిని అణువణువునా నింపుకున్న డాక్టర్ నీలం సంజీవరెడ్డి తుదిశ్వాస వరకూ ఆయన సిద్ధాంతాలను అనుసరించారు. నేడు నీలం సంజీవరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు డాక్టర్ కె.వి.కృష్ణకుమారి.
అయిదు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం మాది. నా పసిమనసును పెంచి పెద్ద చేసి, అనంతంగా ప్రేమ, ఆప్యాయతలు పంచిన అమృతమూర్తులు, ఓ రకంగా నా పెంపుడు తల్లిదండ్రులు డాక్టర్ నీలం సంజీవరెడ్డి దంపతులు. మా నాన్నగారు కాజ జగన్నాథరావు, సంజీవరెడ్డి అంకుల్ ప్రాణస్నేహితులు. ఆయన ఎప్పుడు తెనాలి వచ్చినా మా ఇంటికి రాకుండా, అమ్మచేతి వంట తినకుండా వెళ్లేవారు కాదు. 1962లో ముఖ్యమంత్రి హోదాని, ప్రొటోకాల్‌ని పక్కన పెట్టి, నాన్నతో పాటు నడుచుకుంటూ వచ్చి, రంగరాయ మెడికల్ కాలే జీలో నన్ను చేర్పించారు. మా కృష్ణ మంచి డాక్టరై మీకే కాదు..

నాకు కూడా మంచి పేరు తెచ్చిపెడుతుంది అని కాలేజీ యాజమాన్యంతో అంటున్నప్పుడు అంకుల్ కళ్లలో కనిపించి వాత్సల్యం నిండిన వెలుగును నేను ఇన్నేళ్ల తరువాత కూడా మరచిపోలేను. కేంద్ర మంత్రిగా ఎన్నో పనుల్లో ఉన్నా ఢిల్లీ నుంచి నాకు స్టెతస్కోప్ పంపి ఆశీర్వదించారు. చిన్నవయసులోనే నాన్న నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయినప్పుడు కొండంత అండగా నిలిచిన ఆత్మబంధువు సంజీవరెడ్డి అంకుల్. గుంటూరులో జరిగిన ఎఐసిసి మీటింగ్‌లో శ్రీమతి ఇందిరాగాంధి, లాల్‌బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్‌లకు నన్ను తన నాలుగో కూతురుగా పరిచయం చేశారు.

ఆ రోజు తిరిగి రాదు!

1996 మే 19న ఎప్పటిలాగే అంకుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి బెంగుళూరు ఫోన్ చేశాను. ఈ సారి ఎందుకో నా గొంతువొణికింది. కళ్లు తొణికాయి. 'ఏమైంది కృష్ణా! నీ గొంతు ఎందుకు అదోలా వుంది? నువ్వు దూరంగా ఎక్కడ ఉన్నావ్? ఇక్కడ మాతో నువ్వు లేకపోతే కదా? ఈ హడావుడి అంతా అయ్యాక బెంగుళూరు వచ్చేయ్. కొన్నిరోజులు సరదాగా గడుపుదువుగాని...' అన్నారు అంకుల్ ప్రేమనిండిన గొంతుతో. ఆ ప్రేమకు నా కళ్లు వర్షించాయి. కానీ ఆ రోజు మళ్లీ తిరిగి రాదని నేను ఊహించలేకపోయాను. ఫుడ్‌పార్టికల్స్ లంగ్స్‌లోకి వె ళ్లడంతో అంకుల్‌ను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించారు.

అయినా అంకుల్ కోలుకుంటారని, ఆప్యాయంతా నాతో మాట్లాడతారనే ఊహించాను. 1996 జూన్ 1న క్లినిక్ నుంచి ఇంటికి వచ్చి టి.వి. ఆన్ చేయబోయాను. అక్కయ్యా! రాత్రి బాగా పొద్దుపోయింది. ఇప్పుడు టి.వి. ఎందుకు? ముందు భోజనం చెయ్యి..అంటూ అడ్డుకున్నారు నా చెల్లెళ్లు... తమ్ముళ్లు. వాళ్ల చేతులు వదిలించుకొని..." ఇప్పుడు భోజనం ఏమిటీ? అవతల అంకుల్‌కు ఎలా ఉందో ఏమిటో'' అని ఆదుర్దాగా టీ.వీ ఆన్ చేశాను. కుప్పకూలిపోయాను.

నేను, డాక్టర్ డి.ఎల్.ఎన్. ప్రసాద్ బెంగుళూరు బయలుదేరాం. దేవుడు లేని గుడిలో అడుగుపెట్టాం. టి.వి. పక్కనే సోఫాలో నిండుగా కూర్చొని, ఆత్మీయంగా పలకరించే అంకుల్ ఏరి? నిర్మలక్క, నీరదక్క, అంకుర, డాక్టర్ సుధీర్, డాక్టర్ రమణ నన్ను అంటీ దగ్గరకు తీసుకెళ్లారు. ఆంటీ ఆ సమయంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నాకు ధైర్యం చెబుతున్నట్టు, నా వీపు నిమురుతూ చాలా సేపు ఉండిపోయారు. అందరం కలిసి ఆ అమృతమూర్తికి కడసారి వీడ్కోలు పలికాం.

గాంధీ మళ్లీ పుట్టాలి

అంతకు ముందు కలిసినప్పుడు అంకుల్ నాతో అన్నమాటలు ఆ సమయంలో నాకు గుర్తొచ్చాయి. "కృష్ణా! మనుషుల్లో మానవత్వం నశించిపోతున్నది. స్వార్థం మితిమీరుతోంది. అధికారం కోసం ఆరాటం పెరిగింది. ఈ రక్తపాతాలు... చంపుకోవడాలు ఏమిటి? కోట్లకు కోట్లు సంపాదన కావాలి. అధికారం కావాలి. ఇలా అయితే దేశం ఏం కావాలి? ప్రజా సంక్షేమం కోసం ఉపయోగపడని ఈ సంపాదన ఎందుకు? గాంధీ వంటి నైతిక బలం ఉన్న నాయకుడు మళ్లీ పుట్టాలి'' దేశం చివరి శ్వాసలో సైతం ఆరాటపడిన మహనీయుడు మరిలేడు. దశాబ్దాల పాటు ఆయన తో కలిసి నడిచిన ఆంటీ ఎంతో నిబ్బరంగా కనిపించారు.

ఆమె పక్కన కూర్చోపెట్టుకొని నాతో ఇలా ఆన్నారు. " 1929లో గాంధీగారు అనంతపురం వచ్చినప్పుడు మీ అంకుల్ వయసు 16 ఏళ్లు సిల్కు దుస్తులు వేసుకొని గాంధీగారి ఉపన్యాసం విన్నారు. వేలాది మంది అభిమానులు గాంధీగారికి అక్కడ కానుకలు సమర్పించుకొనే వారు. ఆ వస్తువులను వేలం వేయగా వచ్చిన డబ్బును ఉద్యమానికి ఉపయోగించేవారు గాంధీ. ఆలా వేలంలో 16 రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెండి బిస్కెట్ దక్కించుకున్నారు మీ అంకుల్. దాన్ని ఇప్పటికీ భద్రంగా దాచుకున్నారు.

ఆ రోజు నుంచీ ఖాదీ బట్టలు తప్ప మరేవీ కట్టలేదు. రాష్ట్రపతిగా కూడా అవే బట్టలు. రాష్ట్రపతి భవన్‌లో వందల గదులున్నా మా కోసం ఉంచుకున్నవి మూడు గదులే. నిజానికి రాష్ట్రపతి భవనంలో ఆయన బంగారు పంజరంలో ఉన్నట్లు ఉండేవారు. 70 ఏళ్లపాటు గాంధీ సిద్ధాంతాలను ప్రాణంగా భావించి, జీవించారు'' అంటూ కన్నీళ్ల మధ్య అంకుల్‌ను గుర్తుకు చేసుకున్నారు ఆంటీ. అంకుల్ ఎప్పుడూ నాతో అంటూ ఉండేవారు. "కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. అదిలేని వాడు మనిషే కాడు'' అని.

ఆయన భౌతికంగా దూరమైన రోజు నుంచీ ఏటా ఆయన వర్ధంతి సభలు నిర్వహిస్తున్నాను. దాంతో రుణం తీరుతుందని కాదు. ఆత్మ నిండుతుంది. అంతే. దేశం కోసం, రాష్ట్రం కోసం, రాయలసీమ కోసం ఎన్నో చేసిన డాక్టర్ నీలం సంజీవరెడ్డిని మనం సముచిత రీతిలో స్మరిస్తున్నామా అని ఆలోచించాలి. ఆయన జయంతి, వర్థంతులను ఘనంగా జరిపించి, నివాళి అర్పించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉంది. జూబ్లీహాలులో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. - డాక్టర్ కె.వి. కృష్ణకుమారి