Monday, February 14, 2011

యూత్ మంత్ర భగవద్గీత

"భగవద్గీత 'డైనమిక్ ప్రిస్క్రిప్షన్ ఫర్ లైఫ్'. సంతృప్తి, సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. చిన్న వయసులోనే అది జరగాలి'' అంటున్నారు జయారో. బయాలజీ చదువుకుని భగవ ద్గీత ప్రవచనాలను తన కెరీర్‌గా మార్చుకున్న జయారో విశాఖపట్నంలో ప్రసంగాలివ్వడానికి వచ్చినప్పుడు 'నవ్య' కలిసింది. "2030కల్లా మన దేశ జనాభాలో 55 శాతం మంది యువతే ఉంటారు. వాళ్లంతా పాతికేళ్లలోపువారు. వారు విజ్ఞానవంతులయితేనే దేశం పురోగమిస్తుంది.

వారు మంచి వ్యక్తిత్వంతో ఎదగడానికి, విశిష్టమైన వ్యక్తులుగా రూపుదిద్దుకోవడానికి భగవద్గీత అడుగడుగునా సాయపడుతుంది. అందుకే నేను నా పూర్తి సమయాన్ని గీతా ప్రవచనాలకే కేటాయిస్తున్నా''నంటున్న జయారోకు ఆ రంగంలో ముప్ఫయ్యేళ్ల అనుభవం ఉంది. దాంతో ఆమె స్థాపించిన 'వేదాంత విజన్' ట్రస్ట్ దేశవిదేశీయులు భగవద్గీతను సరైన అర్థంలో గ్రహించడానికి పనిచేస్తోంది. జయారో మూలాలు కర్ణాటకలో ఉన్నాయి. అయితే ఆమె పుట్టి, పెరిగిందంతా ముంబై నగరంలోనే.

మైక్రోబయాలజీలో పట్టా పుచ్చుకున్న ఆమె ఎనిమిదేళ్ల పాటు ఒక ఫార్మా సంస్థలో పనిచేశారు కూడా. "చిన్నప్పుడే మా అమ్మమ్మ, తాతయ్యలు నాకు భగవ ద్గీతను బోధించారు. పురాణాలూ, శాస్త్రాలను విపులంగా చెప్పేవారు. రోజూ ఒకేలా గడపడం బోర్, ఏదైనా వినూత్నంగా చెయ్యమని వాళ్లు చెప్పేవారు. పెరిగిన వాతావరణ ప్రభావమేమో మరి, ఫలితం - ఏదో సాధించాలన్న తపన నాలో రగిలింది. సంప్రదాయ సంగీతం, సాహిత్యాల పట్ల ఆసక్తి పెరిగింది. ఫార్మా పరిశ్రమలో నేను మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్‌ని.

నేను భగవద్గీతను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో విజయవంతమయ్యాను. దాన్నే ఇతరులకు అందించాలని ప్రయత్నిస్తున్నాను'' అంటున్నారామె. 'నేను ఆత్మికంగా ఎదగాలి, దేశానికి సేవచేయాలి' అనేదే నా ధ్యేయం. దానికి నేనెంచుకున్న మార్గం ఇది' అనే జయారో తన ఇరవైల్లో భగవద్గీత గురించి ప్రవచనాలిస్తున్నప్పుడు చాలామంది విచిత్రంగా చూసేవారు. "ఇదివరకు నా ప్రసంగాలకు వృద్ధులే ఎక్కువగా వచ్చేవారు, ఇప్పుడు యువతరమే వస్తున్నారు'' అని ఉత్సాహంగా చెప్పారామె.

అందరూ గొప్పగా ఎదగగలరు
ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక పోకడలో యువతకు అందించడంలో జయారోది అందెవేసిన చెయ్యి. విశాఖలో చేసిన ప్రసంగంలో దాదాపు ఆరు వందల మంది పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ "మీరు నైకీ టీషర్టులు వేసుకుని తిరిగితే ఆ బ్రాండ్‌కి ప్రచారం. దానికి ప్రచారకర్తగా ఉండటానికి మీరే కొంత డబ్బు చెల్లించి మరీ ఆ టీషర్టును కొంటున్నారు. మీ వీపు మీద దాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. అయినా మిమ్మల్ని చూసి మరొకరు దాన్ని కొంటారనేమీ లేదు. అదే సంస్థలు తమ బ్రాండ్‌ను విస్తరించడం కోసం మిమ్మల్ని అభ్యర్థించే స్థాయికి మీరు ఎదగాలి.

ఆ ఉత్పత్తులను వాడటానికి అవి మీకు తిరిగి భారీ పారితోషికాలివ్వాలి. విశిష్టమైన వ్యక్తిగా ఎదగడం అంటే అదే...'' అని చెప్పారు. ఇలా సరళమైన ఉదాహరణలతో స్ఫూర్తిదాయకంగా సాగిన ప్రసంగం ముగిసిన తర్వాత విద్యార్థులకేం అర్థమైందో మూడు నాలుగు వాక్యాల్లో రాసివ్వమంటే తలా ఒక తీరున రాశారు. 'వీ షుడ్ నాట్ యూజ్ బ్రాండ్స్. ఎ బ్రాండ్ షుడ్ కమ్ టూ మీ' అని పదేళ్ల పిల్లాడు రాసిన వాక్యాల్లో వ్యక్తమైన ఆత్మవిశ్వాసం ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా రాదేమో. 12-15 మధ్య వయసున్న పిల్లల కోసం జయారో 'ఎర్లీ ఫౌండేషన్ - ఎక్సెలెంట్ ఫ్యూచర్స్' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు.

యానిమేషన్, కథలతో సరదాగా సాగే ఆ కార్యక్రమం ద్వారా వారికి నిర్ణయాలు తీసుకోవడం, భావోద్వేగాలు, క్రమపద్ధతిని అలవర్చుకోవడం వంటివి మనసుకు హత్తుకుపోయేలా చెబుతారు. 16-25 వయసున్న వారికి జయారో 'స్ట్రాంగ్ ఫౌండేషన్స్ - సక్సెస్‌ఫుల్ ఫ్యూచర్స్' అనే మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బలమైన విలువల పునాదిపైనే బలమైన వ్యక్తిత్వం నిలబడుతుందని చెబుతూ మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి తమలోని ప్రతిభకు ఎలా పదునుపెట్టుకోవాలో యువతరంగాలకు తెలియజేస్తుందీ కార్యక్రమం. అందుకే విశాఖనగరం జయారో ప్రవచనాలకు మంత్రముగ్ధమయింది, తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకొంది.

సంతోష రహస్యం
భగవ ద్గీత హిందువులది, కనుక నేను దాన్ని చదవను, నాకు దాని అవసరం లేదు' అని చెప్పేవాళ్లు ఎలాంటివాళ్లంటే 'భూమ్యాకర్షణ సిద్ధాంతం న్యూటన్ కనిపెట్టాడు, అది బ్రిటిష్‌వాళ్లది - మనం దాని జోలికి పోవద్దు' అనేవాళ్లతో సమానం. గీత భారతీయులు అందరిదీ అంటారామె. సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. వాస్తవానికి కోరిక లను అధిగమించినప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. ఉదాహరణకు ప్రమోషన్ కావాలి, కావాలి... అనుకుని నిరంతరం దాని గురించే ఆలోచించే వ్యక్తికి చింత తప్ప మరేం మిగలదు.

అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా ప్రమోషన్ లభిస్తుంది. గీత చెప్పేదీ అదే. నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అంటూ గీతాసారాన్ని సరళంగా అందిస్తారామె. ప్రశాంత మార్గాన్ని చెబుతూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి అంటారు జయారో.

- అరుణ పప్పు