Sunday, March 14, 2010

ఆరోగ్య సాధనాలు


"నాకు దోచిన యారోగ్య సాధనముల చెప్పెదను. అవి సిద్ధాంత వాక్యములని నేను చెప్పను. మీ యిష్టానుసారముగ మార్చుకొనవచ్చును.''

మొదటిది :
1) పెండ్లి చేసికొనగూడదు. ఇట్టివాడు తలపోటు లేక - కడుపుమంట లేక - ఱాతి విగ్రహమువలె - నొడల ముడతయైన లేక - నూఱేండ్లు జీవించును. అందుకు నాది పూచీ. 2) బుద్ధి లేక పెండ్లి చేసుకొనిన యెడల - భార్యపై నధికారము చేయదగడు. ఇట్టివాడు బట్టతల లేక - పండ్లు రాలిపోవుట లేక - యంతర్గతమైన యుష్ణము లేక - గుండెలో గుబులు లేక- యఱువది సంవత్సరముల వఱకు జీవించుటకు నాది పూచి.
రెండవది
ఎట్టి దగవులయినను సంధిమార్గమున దీరుమానించు కొనవలయునే గాని కోర్టు కెక్కగూడదు. ఇట్టివాడు పార్శ్వపునొప్పి - పక్షవాతము - పరిణామశూల - మొదలగు వ్యాధులు లేక యారోగ్యవంతుడై యెనుబది సంవత్సరముల వఱకు జీవించును.
మూడవది :
జంజాట మెన్నడును వృద్ధి చేసికొనగూడదు. ఎంత తగ్గించుకొనిన నంత మంచిది. ఇట్టివారు మూర్ఛవ్యాధి జన్నియను సన్నిపాతవ్యాధి చచ్చువాతము జలోదరము మొదలగునవి లేక యారోగ్యవంతుడై తొంబది సంవత్సరముల వఱకు జీవించును.
నాలుగవది :
కూలికి మాత్రము గ్రంథమెన్నడును వ్రాయగూడదు. ఇట్టివాడు నక్కమోరు - నారకురుపు - నయనరోగము మొదలైన రోగములు లేక యెనుబది సంవత్సరముల వఱకు జీవించును.
అయిదవది :
పరస్త్రీని బ్రక్క చూపున జూడదగదు. ఇట్టివాడు తిమ్మిరివాతము - వీర్యనష్టము - కుష్ఠము - అండవాతము - పుంస్త్వహీనత మొదలగునవి లేక డెబ్బది సంవత్సరముల వఱకు జీవించును.
వది : లేదని యెన్నడును దేవులాడవలదు. ఇట్టివాడు అరెసెరోగము - అజీర్తి - గుండెబరువు - హృద్వేగము మొదలగునవి లేక డెబ్బది సంవత్సరములు జీవించును.
ఏడవది :
ఒకని కుండిపోయెనే యని ఎప్పుడు విచారింప వలదు. ఇట్టివాడు కాలుసేతులు మంట - కార్జెములో పోటు - అంతరకుసుమము మొదలయిన వ్యాధులు లేక అఱువది సంవత్సరములు జీవించును.
ఎనిమిదవది :
ఱేపటిమాట యేమియని యోచింపవలదు. ఇట్టివాడు హృదయవ్యాధి - పార్శ్వశూల- మూత్రకృచ్ఛము మొదలగు వ్యాధులు లేక యరువది సంవత్సరములు జీవించును.
తొమ్మిదవది :
పోయిన దానిని గూర్చి తలపెట్టవలదు. ఇట్టివాడు - కామిల - పాండువు - రక్తక్షయము - అపస్మారము మొదలగు వ్యాధులు లేక యఱువది వత్సరములు జీవించును.
పదవది :
దేవుడు రక్షింపడేమో యని భయపడవలదు. ఇట్టివాడు - విషూచి మహామారి - స్ఫోటకము మొదలగు వ్యాధులు లేక యెనుబది వత్సరములు జీవించును.
మన హృదయ వ్యాపారమును బట్టి యారోగ్యముండును గాని తిన్న యన్నమును బట్టి కాని - త్రాగిన కాఫీని బట్టి గాని - కాల్చిన చుట్టను బట్టి కాని - పీల్చిన పొడుమును బట్టి కాని - వేసికొనిన గంజాయి యుండను బట్టి కాని యుండదు. ఇవి యన్నియు నిమిత్త మాత్రములు. ప్రధానమైనది హృదయ వైఖరి.''


- కాలాచార్యులు
(సాక్షి - పానుగంటి లక్ష్మీనరసింహారావు)

Wednesday, February 24, 2010

ఆరోగ్యమే మహాభాగ్యం

' ఆరోగ్యమే మహాభాగ్యం '

ఆరోగ్యమే మహాభాగ్యము 

ఈ వాక్యము చదవడానికి రెండు సెకండ్లు 

    అర్ధమవడానికి - 60 ఏళ్ళు .... 

కళ్ళు   పళ్ళు   కీళ్ళు ఒళ్ళు  

రిపేరుకు వస్తుంటే

కొంచెం కొంచెం భోధపడుతుంది.